Home జాతీయం హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం.. సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం.. సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు

14
0

హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కోర్టు సుమోటోగా ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలంలోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని సర్వే నంబర్లు 194/1, 211లో స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారన్న ఆరోపణలపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్‌తో పాటు మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కూల్చివేతలకు రెవెన్యూ శాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కలెక్టర్ కోర్టుకు తెలిపారు. తమ అనుమతి లేకుండానే మేడ్చల్ జిల్లాలో హైడ్రా సుమారు 40 కూల్చివేతలు చేపట్టిందని వివరించారు.

రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతలా?

హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రెవెన్యూ శాఖ సూచనల మేరకు జీఎల్‌ఆర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే సరైన రికార్డులను పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

హైడ్రా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ వద్ద ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల వివరాలను వెంటనే హైడ్రాకు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది.

హైడ్రా ఏర్పాటుకు ముందే జారీ అయిన స్టే ఉత్తర్వులను కూడా సంస్థ పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here