జైల్లో ఉన్నా… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు వెంటనే పోవా? దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.
130వ రాజ్యాంగ సవరణ బిల్లు–2025 ప్రకారం… తీవ్ర నేరంలో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ రాకపోతే ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది.
అయితే… ఈ నిబంధనను మార్చాలని జేపీసీ సూచించింది.
పదవి పూర్తిగా రద్దు కాదు… కేవలం తాత్కాలిక సస్పెన్షన్ మాత్రమే ఉండాలని కమిటీ అభిప్రాయపడింది.
ఒకవేళ కోర్టు ఆ నేతను నిర్దోషిగా ప్రకటించినా… కేసు నుంచి డిశ్చార్జ్ చేసినా… లేదా విచారణ ముందుకు సాగకపోయినా… విధించిన సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా రద్దై తిరిగి అదే పదవిలోకి రావచ్చని కమిటీ సూచించింది.
అలాగే… ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలకు మాత్రమే ఈ చట్టం వర్తించాలని స్పష్టం చేసింది.
అంతేకాదు… ఏ నేరాలకు ఈ చట్టం వర్తిస్తుందో ప్రత్యేక షెడ్యూల్ రూపంలో బిల్లులో చేర్చాలని… అలాగే ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
ప్రతిపక్షాలు మాత్రం… ఈ చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై దుర్వినియోగం చేసే అవకాశం ఉందని మొదటి నుంచే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీసీ సూచించిన మార్పులు రాజకీయ కక్షసాధింపుకు అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
జూలై 17న కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుండగా… జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.





