హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగ యువత మెరుపు ధర్నాకు దిగింది. ప్రస్తుతం ప్రకటించిన 7,437 పోలీస్ పోస్టులతో కాకుండా మొత్తం 19 వేల పోలీస్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీస్ నియామక నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అలాగే దరఖాస్తు రుసుమును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరుద్యోగులు, తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ నియామకాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.






