సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పట్టణ పరిధిలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీకారం వండర్ నెస్ట్ ప్లే స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న సుమారు ఐదేళ్ల బాలుడు షణ్ముక్ స్కూల్ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికుల కథనం ప్రకారం, స్కూల్ సమీపంలో ఉన్న చెరువు వద్దకు బాలుడు ఎలా వెళ్లాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్ కుమార్, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, స్కూల్ యాజమాన్యంపై వచ్చిన నిర్లక్ష్య ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు అనంతరం ఘటనకు గల పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
youtube.com/watch?v=qduAc6OXzqk&feature=youtu.be


