డీమానిటైజేషన్ సమయంలో చోటుచేసుకున్న కరెన్సీ మార్పిడి మోసం కేసులో సికింద్రాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు అంతతాలి యాదగిరికి 3 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.4.5 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది.
2017లో బేగంపేటలో కేసు
2017లో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కరెన్సీ నోట్లను కొత్త నోట్లుగా మార్చి ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న 17 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితులను విడివిడిగా విచారించిన పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. పాత కరెన్సీకి బదులుగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీని అక్రమంగా బదిలీ చేసినట్లు నిందితులు అంగీకరించారని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు.
11 మంది దోషులుగా నిర్ధారణ
కేసును విచారించిన న్యాయస్థానం మొత్తం 11 మందిని దోషులుగా తేల్చింది. వారిలో ప్రధాన నిందితుడైన అంతతాలి యాదగిరికి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4.5 కోట్ల జరిమానా విధించింది.
మరో 10 మంది దోషులకు ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున జరిమానా విధించింది. కేసులో మిగిలిన నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
డీమానిటైజేషన్ సమయంలో జరిగిన ఈ కరెన్సీ మార్పిడి మోసం కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువడటంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.






