కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వెల్లడించారు. వయసు, ఆరోగ్య పరిస్థితులతో పాటు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోవడం తన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు.
మాండ్య జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధరామయ్య.. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతానన్నారు.
తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, అయినప్పటికీ 2028 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
1978 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న సిద్ధరామయ్యకు 2028 నాటికి రాజకీయ జీవితంలో 50 ఏళ్లు పూర్తికానున్నాయి. అప్పటికి ఆయన వయసు 82 ఏళ్లకు చేరుకోనుంది. దీంతో వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.






